
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు మృతిచెందడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.
ఈ ప్రమాదంలో మరో 23 మంది చిన్నారులు గాయపడ్డారని, వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా విధ్వంసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రిమ్స్ ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు జిల్లా స్థాయి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారని తెలిపారు. అయినా మొద్దు నిద్ర వీడని రేవంత్ సర్కార్లో కనీస చలనం కనిపించలేదన్నారు. అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని ఆరోపించారు.
కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని కేటీఆర్ ఆగ్రహించారు. ఆదిలాబాద్ రిమ్స్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను వెంటనే నిపుణులతో తనిఖీ చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ సర్కార్ చేతకానితనం వల్ల పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్