
ఆంధ్రప్రదేశ్ , 22 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో సుదీర్ఘమైన తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం సీపోర్ట్లు మరియు కోస్టల్ కారిడార్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. భావనపాడు (మూలపేట), రామాయపట్నం, మచిలీపట్నం మరియు కాకినాడ గేట్వే పోర్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రం నౌకావాణిజ్యంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. పోర్టులను జాతీయ రహదారులతో మరియు రైల్వే నెట్వర్క్తో అనుసంధానించేందుకు పోర్ట్ కనెక్టివిటీ రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతోంది. గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం ద్వారా సరుకు రవాణా వ్యయం తగ్గడమే కాకుండా, తీరప్రాంత పర్యాటకం ఊపందుకుంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ తీరప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, మత్స్యకారులు మరియు స్థానిక నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్