
అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో చదువుతున్న వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. ఇంటర్న్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, MDS, DNB విద్యార్థులకు అందించే స్టైపెండ్ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. MBBS, BDS హౌస్ సర్జన్లకు 10 శాతం, ఇతర పీజీ మరియు ప్రత్యేక వైద్య కోర్సుల విద్యార్థులకు 5 శాతం పెంపు వర్తించనుంది.
కొత్త నిర్ణయం ప్రకారం హౌస్ సర్జన్ల నెలవారీ స్టైపెండ్ రూ.25,906 నుంచి రూ.28,497కు పెరగనుంది. PG డిగ్రీ , MDS, DNB మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.63,864, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.64,604, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.68,005 చెల్లించనున్నారు. PG డిప్లొమా విద్యార్థులకు కూడా దాదాపు ఇదే స్థాయిలో సవరించిన స్టైపెండ్ వర్తిస్తుంది. సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు మొదటి సంవత్సరం రూ.84,525, రెండో సంవత్సరం రూ.86,940, మూడో సంవత్సరం రూ.89,355 చెల్లించేలా కొత్త రేట్లు నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్