
తిరుమల, 22 సెప్టెంబర్ (హి.స.) ఏడుకొండల వాడి దర్శనం కోసం గోవింద నామస్మరణలతో మెట్లు ఎక్కుతున్న భక్తులకు అడుగడుగునా భయం వెంటాడింది. ప్రశాంతంగా సాగుతున్న వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన భయానక పరిస్థితి ఎదురైంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో అనుకోని విధంగా ప్రత్యక్షమైన ఓ చిరుతపులి భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. చెట్టుపై రాజసంగా కూర్చున్న ఆ క్రూర మృగాన్ని చూసిన యాత్రికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
అనంతరం దగ్గరలోని భద్రతా సిబ్బందికి చిరుత సంచారంపై సమాచారం అందజేశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్, అటవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
వీరు వెళ్లే సమయానికి చిరుత చెట్టుపై నుంచి దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమలకు నడక దారిని వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV