
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా జీవో ఆర్టీ నెం. 1396ను విడుదల చేశారు. నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఆ సెలవుదినానికి బదులుగా నవంబర్ 14 రెండో శనివారం పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గణేష్ ఉత్సవాల ఊరేగింపు, నిమజ్జనంలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకే ఈ సెలవును కేటాయించినట్లుగా అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు