కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే కరువు పరిస్థితులు.. హరీష్ రావు
దేశంలో ఎక్కడా క్రాప్ హాలిడే లేదని, తెలంగాణలో మాత్రమే క్రాప్ హాలిడే కొనసాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
Harish Rao


నాగర్ కర్నూల్, 23 సెప్టెంబర్ (హి.స.)

దేశంలో ఎక్కడా క్రాప్ హాలిడే లేదని, తెలంగాణలో మాత్రమే క్రాప్ హాలిడే కొనసాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయనీ విమర్శించారు. నీళ్లు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక రైతాంగం కన్నీళ్లు పెడుతోందని ఆరోపించారు.

బుధవారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నాగర్కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ భవన్లో మీడియాతో హరీశ్ రావు మాట్లాడారు. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడం చేతకాని ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

శ్రీశైలం నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 4 వేల క్యూసెక్కుల నీటిని తీసుకురావాల్సి ఉండగా, కేవలం 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నారని హరీశ్ రావు తెలిపారు. మిగిలిన నీటిని సీఎం గురువు చంద్రబాబు తన సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఐదు మోటార్లతో 24 గంటల పాటు ప్రాజెక్టును నడపాల్సి ఉండగా, కేవలం మూడు మోటార్లతో ఎనిమిది గంటలు మాత్రమే నడుపుతూ నీటిని విడుదల చేస్తున్నారని విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande