ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై రంగంలోకి మానవ హక్కుల కమిషన్, సుమోటోగా కేసు నమోదు
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై రంగంలోకి మానవ హక్కుల కమిషన్, సుమోటోగా కేసు నమోదు
Human rights


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పసికందుల ప్రాణాలు బలిగొన్న ఈ విషాద ఉదంతాన్ని కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సుమోటో గా తీసుకుంటూ విచారణ స్వీకరించారు.

ప్రాణాలు తీసిన ఏసీ షార్ట్ సర్క్యూట్

సెప్టెంబర్ 21 (సోమవారం) అర్ధరాత్రి వేళ రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU) లో ఒక్కసారిగా ప్రమాదం ముంచుకొచ్చింది. వార్డులోని ఎయిర్ కండిషనర్ (AC) లో సాంకేతిక లోపం తలెట్టి షార్ట్ సర్క్యూట్‌ అవ్వడంతో మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే ప్లాస్టిక్ పరికరాలు కాలిపోయి వార్డు అంతా దట్టమైన విషపూరిత పొగలు అలుముకున్నాయి. ఈ ఊపిరాడని వాతావరణంలో చిక్కుకుని, చికిత్స పొందుతూ ఐదుగురు పసికందులు మరణించారు. ప్రమాద సమయంలో వార్డులో ఉన్న మిగిలిన ఇరవై ఐదు మందికి పైగా శిశువులను సిబ్బంది, తల్లిదండ్రులు కిటికీలు పగలగొట్టి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

నివేదిక కోరిన కమిషన్

పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన మానవ హక్కుల కమిషన్, ఈ ఘోరానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో విద్యుత్ వైరింగ్ నిర్వహణ తీరు, అత్యవసర సమయంలో పనిచేయాల్సిన ఫైర్ అలారమ్‌లు, అగ్నిమాపక సామాగ్రి అందుబాటు మరియు భద్రతా లోపాలకు బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కమిషన్ అక్టోబర్ ఇరవై ఏడు కి వాయిదా వేసింది.

ప్రభుత్వ చర్యలు

ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande