తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కర్ణాటక ప్రభుత్వం సానుకూల స్పందన... జూరాలకు నీటి విడుదల
కృష్ణా జలాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Jurala project


మహబూబ్‌నగర్, 23 సెప్టెంబర్ (హి.స.)

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ఎగువన ఉన్న కృష్ణా జలాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం (ఉప ముఖ్యమంత్రి) డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మరియు ప్రజాప్రతినిధుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల వల్ల జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోయిందని, దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వివరించారు.

పంటల రక్షణ కోసం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం, విడతల వారీగా 3 టీఎంసీల నీటిని (సుమారు 5,000 క్యూసెక్కులు) జూరాల వైపు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సోదరభావానికి, సహకారానికి ఇది నిదర్శనమని కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నీటి విడుదల ద్వారా పాలమూరు ప్రాంత రైతాంగానికి పెద్ద ఉపశమనం లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande