
శ్రీకాకుళం (టెక్కలి), 23 సెప్టెంబర్ (హి.స.)
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
టెక్కలి మండలం రాయవలస (బర్మా కాలనీ) సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. టెక్కలిలోని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో (Social Welfare Hostel) ఇంటర్మీడియట్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. భారీ వర్షం, తుఫాను వాతావరణం కారణంగా నీటిలో చేపలు పట్టేందుకు వీరంతా రైల్వే ట్రాక్ సమీపానికి వెళ్లారు.
ట్రాక్ దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రాజారాణి ఎక్స్‌ప్రెస్ రైలును వర్షం దృష్ట్యా వారు గమనించలేకపోయారు. దీంతో రైలు వీరిని ఐదుగురినీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో విశాఖ రావు, దిలీప్, శరత్, శివ అనే నలుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులంతా టెక్కలి మండలం 'డమరు' గ్రామానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు.
అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సల్మాన్ రాజు అనే విద్యార్థిని వెంటనే టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంటర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఒకేసారి మృతి చెందడంతో డమరు గ్రామంలోనూ, హాస్టల్‌లోనూ తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi