
విశాఖపట్నం,, 24 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరాన్ని తాకింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 6 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వాయుగుండం బుధవారం అర్ధరాత్రి సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం తాకినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 3 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తీవ్ర వాయుగుండం విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంతకుముందు IMD అంచనా వేసింది.
ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాలైన అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘ఫ్లాష్ఫ్లడ్’ (Flash floods) ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. ఉదయం 11:30 గంటల వరకు పలు లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీ వాగులు, వంకలు ఆకస్మిక వరద నీటితో పోటెత్తే అవకాశముందని హెచ్చరించింది.
వాయుగుండం బలహీనపడి నేల వైపు కదులుతున్న క్రమంలో మేఘాల సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఏజెన్సీ ప్రాంతాలతో పాటు వాగులు, కాజ్వేలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, సాధారణ ప్రజలు సైతం అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV