కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కలకలం.. సీఈసీ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కలకలం.. సీఈసీ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు
CJP PROTEST


న్యూఢిల్లీ, 24 సెప్టెంబర్ (హి.స.)

భారత ఎన్నికల సంఘంలో ముఖ్య అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వైనం దేశ రాజకీయాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎస్‌ఐఆర్‌తో సహా ఎన్నికల వ్యవస్థ తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వస్తున్న వార్తలు రాజకీయ వేడెక్కిస్తున్నాయి. గడచిన కొద్ది నెలల వ్యవధిలోనే పలుమార్లు కమిషనర్లు రాతపూర్వకంగా తమ అసమ్మతిని నమోదు చేసినట్లు సమాచారం వెలువడడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌పై విపక్షాలు విమర్శల దాడిని తీవ్రం చేశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు పలు విపక్ష రాజకీయ శక్తులు సీఈసీ పదవి నుంచి తప్పుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) రంగంలోకి దిగి మరింత దూకుడు పెంచింది. జ్ఞానేశ్‌ కుమార్‌ రాబోయే నూట ఇరవై గంటల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అల్టిమేటం జారీ చేశారు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.

సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలను గత ఏడాది నాటి స్థితికి తీసుకురావాలని, ఎస్‌ఐఆర్‌ తతంగం తాలూకు డాక్యుమెంట్లను ప్రత్యేక న్యాయ కమిటీ పరిశీలనకు అప్పగించాలని కోరారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ సీఈసీ తీరును తప్పుబట్టారు. గత ఓటర్ల జాబితా ప్రకారమే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు శివసేన వర్గం నేత ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ల మధ్యే విభేదాలు తలెత్తడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సైతం తాము గతంలో లేవనెత్తిన అనుమానాలకు ఈ తాజా పరిణామాలు బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఆరోపణలన్నింటినీ ఎన్నికల సంఘం వర్గాలు ఖండించాయి. అంతర్గత సమావేశాల్లో కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం, చర్చలు జరగడం సర్వసాధారణమని స్పష్టం చేశాయి. ఎస్‌ఐఆర్‌తో పాటు గడచిన కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఏకాభిప్రాయంతోనే అమలైందని స్పష్టం చేసింది. అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమని, విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తిప్పికొట్టాయి. మొత్తానికి ఈ వివాదం జాతీయ రాజకీయాల్లో నూతన చర్చకు తెరలేపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande