

తిరుమల, 24 సెప్టెంబర్ (హి.స.) తొమ్మిది రోజుల పాటు జరిగిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.
బుధవారం రాత్రి శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.
ఉత్సవాల మొదటిరోజు ధ్వజారోహణం సందర్భంగా గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను కృతజ్ఞతలతో తిరిగి పంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవర్లకు విశేష సమర్పణ చేశారు.అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు బంగారు తిరుచ్చిలో సాయంత్రం 7 గంటలకు తిరువీధుల్లో ఊరేగి ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు ఉత్సవర్లు వేంచేశారు.అర్చకబృందం పూజాది కార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించి బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు ప్రకటించారు.
ధ్వజపడి నివేదన కావించి, ఆలయంలోని బంగారువాకిలిలో ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు.అంతకుముందు ఉదయం చక్రస్నాన ఘట్టం కనులవండువగా జరిగింది. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం అనంతరం చక్రత్తాళ్వార్ పుష్కరిణిలో మునకలు వేయగానే పుష్కరిణిలో అప్పటికే వేచివున్న వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో స్నానమాచరించారు.అప్పటినుంచి సాయంత్రం వరకు భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV