
న్యూఢిల్లీ, 25 సెప్టెంబర్ (హి.స.)
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై వెలువడిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్న ఎస్ఐర్ సంబంధిత నిర్ణయాలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా పోర్టల్లో మార్పులు చేసిన ఫారమ్-6ను రద్దు చేసి, ఓటర్ల నమోదు నియమాలు-1960 ప్రకారం నిర్దేశించిన అసలైన చట్టబద్ధమైన పాత 'ఫారమ్ 6'ను తక్షణమే పునరుద్ధరించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా న్యాయ విచారణ కమిషన్తో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
దీంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం (RP Act) నిబంధనల ప్రకారం తమ అధికారిక విధులను ఉల్లంఘించినందుకు గాను సీఈసీ జ్ఞానేశ్ కుమార్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీశ్ గార్గ్ (ఐఏఎస్), ఈసీఐ ఐటీ విభాగాధిపతి సీమా ఖన్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని పిటిషనర్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..