ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.
Rain


విశాఖపట్నం, 25 సెప్టెంబర్ (హి.స.) పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఈ తీవ్ర వాయుగుండం కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం గోపాల్పూర్కు సుమారు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మొత్తంగా మరో రెండ్రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 16జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. ఉత్తర కోస్తాపై తీవ్రంగా వర్షాల ప్రభావం కనిపిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande