ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వార అదిరిపోయే శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. డబ్బులు అందేది అప్పుడే.. రెడీగా ఉండండి..


ఆంధ్రప్రదేశ్, 25 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వార అదిరిపోయే శుభవార్త అందించింది.

దసరా పండుగ కానుకగా కొత్త పింఛన్లను పంపిణీ చేయనుంది. కొత్తగా 3 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను మంజూరు చేయనుంది. కొత్తగా పించన్లు పొందేందుకు దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు పరిశీలన పూర్తి చేయనుండగా.. వారిలో అర్హులైన 3 లక్షల మందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాను సిద్దం చేయనున్నారు.

అనంతరం వారికి వచ్చే నెలలో రానున్న దసరా పండుగ ముందే పించన్లను పంపిణీ చేయనుంది.

ఈసారి పింఛన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు సరైనవేనా, వారికి నిజంగానే ఆర్థిక ఆసరా అవసరమా అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు పరిశీలన జరుపుతున్నారు. గతంలో పలుకుబడితో అనర్హులు సైతం లబ్ది పొందిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నకిలీ పత్రాలతో పింఛన్లు పొందుతున్న సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అనర్హుల పేర్లను ఇప్పటికే జాబితా నుంచి తొలగించారు. కేవలం నిజమైన నిరుపేదలు, అత్యవసరంగా ఆర్థిక చేయూత అవసరమైన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ముఖ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న వితంతు మహిళల నుంచి భారీ స్పందన లభించగా, సుమారు 2.5 లక్షల మందికి పైగా వితంతువులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆర్థిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు తదితర వర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను కూడా నిశితంగా పరిశీలించి తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

ఇక, అర్హత సాధించిన కొత్త లబ్ధిదారులకు అక్టోబర్ నెల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్ము నేరుగా అందనుంది. దీని ప్రకారం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తుండగా, దివ్యాంగులకు మాత్రం పింఛన్ కింద నెలకు రూ.6,000 అందనుంది. దసరా పండుగ వేళ ప్రభుత్వం నుంచి అందనున్న ఈ ఆర్థిక చేయూత తమ కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని నూతన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande