
కర్నూలు, 25 సెప్టెంబర్ (హి.స.) కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో మక్క రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వారికున్న కొద్దిపాటి నీటి వనరులతో రాత్రింబవళ్లు కష్టించి రైతన్నలు అరకొరగా మక్క పంటను సాగు చేశారు. పంట కోతకు వచ్చే సమయం నుంచి గత పది రోజులుగా తరచూ కొద్దిపాటి వర్షాలు కురుస్తుండడంతో మొక్కజొన్న పంటను కోత కోసేందుకు, కోత కోసిన రైతులు నూర్పిడి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడక్కడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మూర్లో కోత కోసి నూర్పిడి చేసిన రైతులు మొక్కలను ఆరబెట్టినందుకు హరిగోశ పడుతున్నారు. గత పది రోజులుగా వర్షాలు తరచూ కురుస్తుండడం వల్ల ఆరబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.మొక్కజొన్న సాగుకు రైతులు ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు కౌలు రైతులు రూ.30వేల కౌలుతో పెట్టుబడి భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు రూ.2700 పలుకుతోంది.
ఎల్నినోతో తగ్గిన దిగుబడి
వాతావరణం అనుకూలిస్తే సాధారణంగా ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చేంది. కానీ ఈ ఏడాది 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే రావడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మీరు దారుణంగా మారింది. ఎల్నినో వర్షాలు తగినంతగా కురియకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో రైతులు తడిచిన మక్కలను ఆ కల్లాల నుంచి గోదాములకు, షెడ్డుల కిందికి తరలించి మొక్కజొన్నలను ఆరబెట్టుకుంటున్నారు. దీనివల్ల కూలీల ఖర్చు తో పాటు రవాణా చార్జీలు కూడా భారంగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు వర్షాలకు పంట దిగుబడును నష్టానికి గురికాకుండా భారీ షెడ్లను సబ్సిడీలతో నిర్మాణం చేసి ఆదుకోవాలని, దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం పెద్దలు అండగా నిలబడాలని ఆర్మూర్ ప్రాంతంలోని రైతులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV