
తిరుమల, 26 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్ (పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్)ను ఏర్పాటు చేసిందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పత్రికా ప్రకటన ద్వార తెలిపారు.
ఎక్స్పీరియన్స్ సెంటర్లో నిరంతరం కొత్త కంటెంట్ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని అదనపు ఈఓ తెలిపారు. పురాణాలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం, స్వామివారి సేవలు, భక్తుల కథలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, పరిపాలన, దాతల సేవలు తదితర అంశాలపై విభిన్న కథనాలను రూపొందించి క్రమం తప్పకుండా ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో భక్తులు దర్శనానికి వెళ్లే ముందు స్వామివారి గురించి, తిరుమల ఆలయం గురించి, ఇక్కడి సంప్రదాయాలు, సేవలు, చరిత్ర గురించి మరింత తెలుసుకుని ఆధ్యాత్మిక పరిపూర్ణత, సంతృప్తితో దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన మరో ముఖ్యమైన ప్రాజెక్టు.. నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అని అదనపు ఈవో తెలిపారు. డిజిటల్ కంటెంట్తో పాటు తిరుమల ఆలయ చరిత్ర, వారసత్వం, పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులను సమగ్రంగా ప్రదర్శించే విధంగా మ్యూజియంను ఆధునీకరించినట్లు చెప్పారు. దాదాపు 14 గ్యాలరీల్లో ప్రత్యేకమైన థీమ్తో మ్యూజియాన్ని తీర్చిదిద్దామని, ఆలయ సంప్రదాయం, వారసత్వానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.
మ్యూజియం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక మాన్యువల్ను రూపొందిస్తున్నామని, ఇందులో సీసీ కెమెరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, గైడ్ల సేవలు, భద్రతా చర్యలు, కళాఖండాల ప్రత్యేక నంబరింగ్ తదితర అంశాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. మ్యూజియంను ఎస్ఓపీ (SOP) ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో భక్తులకు దర్శనంతో పాటు ఇతర ఆధ్యాత్మిక, జ్ఞానదాయక అనుభూతులను అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులు తమ నిరీక్షణ సమయంలో ఎక్స్పీరియన్స్ సెంటర్, మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించి తిరుమల చరిత్ర, ఆలయ విశిష్టత, స్వామివారి సేవలు, సంప్రదాయాలు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తే వారి తిరుమల యాత్ర మరింత పరిపూర్ణంగా మారుతుందన్నారు.
తిరుమలను మరింత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇటువంటి ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. మీడియా సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV