
అమరావతి , 26 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర వర్షపాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చాయి. నేడు వెల్లడైన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 11 జిల్లాలు ఇప్పుడు సాధారణ వర్షపాతం కేటగిరీలోకి వచ్చాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం వర్షపాతం 379 మిల్లీమీటర్లుగా ఉండగా, సాధారణంగా ఈ కాలంలో 550.51 మిల్లీమీటర్లు ఉండాలి. దీంతో సీజన్ లోటు 31.15 శాతంగా నమోదైంది. కొద్ది రోజుల క్రితం దాదాపు 50 శాతానికి చేరిన లోటు భారీ వర్షాల కారణంగా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు భారీగా కురిశాయి. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రానికి 68.64 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చింది. ఈ సమయంలో సాధారణంగా రావాల్సిన వర్షపాతం 11.59 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే సాధారణం కంటే 492 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో ఈ రెండు రోజుల్లో 255.08 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో అక్కడి లోటు పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలు సాధారణ వర్షపాతం కేటగిరీలోకి వచ్చాయి.
అయితే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికీ లోటు కొనసాగుతోంది. రాయలసీమ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. అనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో లోటు 40 శాతానికి పైగానే ఉంది. అన్నమయ్య జిల్లాలో 62.09 శాతం లోటు నమోదవడం ప్రత్యేకంగా ఆందోళన కలిగించే అంశంగా ఉంది.
ఈ వర్షాలు సాగు రంగానికి కొంత ఊరటనిచ్చినా, అధిక వర్షం కారణంగా వరదలు, పంట నష్టం, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్