ఏపీలో 807 మద్యం దుకాణాలకు కొత్త కేటాయింపు
ఆంధ్రప్రదేశ్లో 2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి పనిచేయని లేదా పునరుద్ధరణ పొందని 807 మద్యం రిటైల్ దుకాణాలను కొత్తగా కేటాయించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
Liquor


అమరావతి , 26 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో 2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి పనిచేయని లేదా పునరుద్ధరణ పొందని 807 మద్యం రిటైల్ దుకాణాలను కొత్తగా కేటాయించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రకటించిన ప్రకారం, ఈ దుకాణాల కేటాయింపు లాటరీ విధానంలో జరగనుంది.

కొత్త ఎక్సైజ్ విధానం అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు అమల్లో ఉంటుంది.

మొత్తం 807 దుకాణాల్లో 799 ఓపెన్ కేటగిరీకి, ఎనిమిది రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవి. 21 సంవత్సరాల వయస్సు దాటిన వారు, నిర్దేశించిన అర్హతలు కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు, అదనంగా రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 24న ప్రారంభమైంది. అక్టోబర్ 1 చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 3న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన అభ్యర్థులను లాటరీ ప్రక్రియలోకి తీసుకుంటారు.

ఒక దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినప్పుడు లాటరీ నిర్వహిస్తారు. అవసరమైన సంఖ్యలో దరఖాస్తులు రాకపోతే గడువు పొడిగించే అధికారం ఎక్సైజ్ కమిషనర్కు ఉంది. అక్టోబర్ 5 ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియను కలెక్టర్లు నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande