
ఢిల్లీ , 26 సెప్టెంబర్ (హి.స.)జమ్మూ కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే తీర్మానంలోని 2000 నాటి స్వయంప్రతిపత్తి తీర్మానానికి సంబంధించిన ప్రస్తావన సభలో తీవ్ర రాజకీయ ప్రతిస్పందనకు దారితీసింది.
2019లో జమ్మూ కశ్మీర్కు సంబంధించిన రాజ్యాంగపరమైన వ్యవస్థలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల తర్వాత, ఆ ప్రాంతానికి మళ్లీ రాష్ట్ర హోదా కల్పించాలన్న అంశం రాజకీయ చర్చలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించింది. ఇప్పుడు ఈ అంశాన్ని ఎన్నికైన అసెంబ్లీ వేదికగా ముందుకు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తీర్మానంలో పాత అసెంబ్లీ తీర్మానాలను ప్రస్తావించడం బీజేపీ సభ్యుల అభ్యంతరానికి ప్రధాన కారణంగా మారింది. ముఖ్యంగా 2000లో అప్పటి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదించిన స్వయంప్రతిపత్తికి సంబంధించిన తీర్మానాన్ని ప్రస్తావించడం వల్ల సభలో వాగ్వాదం జరిగింది. బీజేపీ సభ్యులు దీనికి అంగీకరించకుండా నిరసన చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్