
ఢిల్లీ , 26 సెప్టెంబర్ (హి.స.)భారత ప్రధానన్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ బీహార్లోని పాట్నాలో దేశంలోనే మొట్టమొదటి బాధితుల హక్కుల కేంద్రంను ప్రారంభించారు. బీహార్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (BSLSA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం, నేర బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఒకే గొడుగు కింద అన్ని రకాల సేవలను అందించనుంది.
బాధితులు వేర్వేరు ప్రభుత్వ శాఖలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై చట్టపరమైన హక్కులు, పరిహారాలు మరియు రికార్డులను సమన్వయం చేసేలా ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రతి బాధితుడికి సంబంధించి ఒకే కేసు రికార్డును నిర్వహించి, వివిధ అధికారుల ఎదుట పదేపదే తమ బాధాకరమైన అనుభవాలను వివరించాల్సిన ఇబ్బందిని ఇది పూర్తిగా తొలగిస్తుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు, ఉపాధి, గృహ వసతి, ఆరోగ్య సేవలు అందించేందుకు ఒక ప్రత్యేక హెల్ప్లైన్ను కూడా ప్రారంభించారు. అలాగే మారుమూల జిల్లాలకు గ్రామీణ స్థాయి చట్టపరమైన సహాయాన్ని విస్తరించడానికి ప్రత్యేక మల్టీ-యూటిలిటీ వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. పాట్నా జిల్లాలో 12 నెలల పాటు ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్గా ప్రారంభించిన ఈ కేంద్రాన్ని, భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్