తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Rain


అమరావతి , 26 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీ, యానాంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాలలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో (గరిష్టంగా 60 కిమీ వరకు) బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో వేగంగా మారుతున్న వాతావరణం..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ రోజు శని, ఆదివారాల్లో కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande