
హైదరాబాద్ , 27 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు భారీ స్థాయిలో జరిగాయి. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణేశ్ను దర్శించేందుకు దాదాపు 30 లక్షల మంది భక్తులు వచ్చారని, బాలాపూర్ గణేశ్ వద్ద మరో 15 లక్షల మంది వరకు భక్తులు వచ్చినట్లు అధికారిక అంచనాలు పేర్కొంటున్నాయి.
నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు హైదరాబాద్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసులతో పాటు జిల్లాల నుంచి వచ్చిన బలగాలను కూడా వినియోగించారు. దాదాపు 20 వేల మంది నగర పోలీసు సిబ్బంది, 8 వేల మంది జిల్లా బలగాలు విధుల్లో పాల్గొన్నారు.
ఈసారి ప్రధాన నిమజ్జన మార్గంలో పరిపాలనా సమన్వయం మెరుగుపడిందని అధికారులు పేర్కొన్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు ప్రధాన ఊరేగింపు మార్గం ఒకే కమిషనరేట్ పరిధిలోకి రావడం వల్ల పోలీసు విభాగాల మధ్య సమన్వయం సులభమైంది. భారీ సంఖ్యలో భక్తులు, వాహనాలు, గణేశ్ విగ్రహాలు ఒకేసారి నగరంలో కదలడంతో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సహాయం, పారిశుధ్యం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా నిలిచాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్