ఏపీలో పిడుగులు, భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరోసారి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
Lighting


అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరోసారి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఇప్పటికే భారీ వర్షాలు, వరదల ప్రభావాన్ని ఎదుర్కొన్న ప్రాంతాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సూచనల ప్రకారం ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పిడుగుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఒంటరి ప్రదేశాల్లోని ఎత్తైన నిర్మాణాల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా వర్షం, ఉరుములు ఉన్న సమయంలో పొలాల్లో పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 43,802 హెక్టార్లకు పైగా పంటలు నీటమునిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడైన నేపథ్యంలో తాజా వర్షాల హెచ్చరికలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 69,258 మంది రైతులు ఇప్పటికే ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావంతో పాటు సముద్ర పరిస్థితులను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande