
హైదరాబాద్ , 27 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్లో ఆహార భద్రతకు సంబంధించి అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలు రెస్టారెంట్లలో ఉల్లంఘనలు బయటపడ్డాయి. TG SAFE అధికారులు కోర్ అర్బన్ రీజియన్లో 20 ఆహార సంస్థలను తనిఖీ చేశారు. కొన్ని చోట్ల బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, ఎలుకల మల అవశేషాలు కనిపించడంతో పాటు ఆహార నిర్వహణలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు గుర్తించారు.
అధికారులు తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైన లేదా కలుషితమైన కూరగాయలను గుర్తించి వాటిని అక్కడికక్కడే తొలగించారు. కొన్ని సంస్థల్లో నీటి పరీక్షా నివేదికలు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఆహారాన్ని నిర్వహించే సిబ్బంది ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు.
ఆహార సంస్థల్లో పరిశుభ్రత పాటించకపోతే వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజలు భోజనం చేసే రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార నిల్వ, వంటగది పరిశుభ్రత, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, నీటి నాణ్యత వంటి అంశాలు కీలకమైనవి.
అధికారులు అనుమానం ఉన్న ఆహార పదార్థాల నమూనాలను కూడా సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు నోటీసులు ఇచ్చి లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్