
హైదరాబాద్ , 27 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వేలాది కుటుంబాలకు కీలకంగా మారనుంది.
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, వాస్తవానికి అర్హత కలిగిన ప్రైవేట్ ఆస్తులను ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.41 లక్షల ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ మార్గం సుగమం కానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం చట్టబద్ధమైన లేఅవుట్, భవన అనుమతులు లేదా అపార్ట్మెంట్కు సంబంధించి సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న ఆస్తులకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
ఇప్పటివరకు 22-A జాబితాలో ఆస్తి పేరు ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యజమానులకు ఇది ప్రాధాన్యమైన పరిణామంగా భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆస్తి యజమానులు చట్టబద్ధమైన పత్రాలు కలిగి ఉన్నప్పటికీ, నిషేధిత జాబితాలో పేరు ఉండటం వల్ల కొనుగోలు, విక్రయం, వారసత్వ బదలాయింపు వంటి వ్యవహారాలు ముందుకు సాగని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం కోసం జీవితకాల పొదుపులను పెట్టుబడిగా పెట్టిన మధ్యతరగతి కుటుంబాలకు ఇలాంటి సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే అర్హత ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్పష్టత పెరిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్