
హైదరాబాద్ , 27 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలోని విప్రో సర్కిల్ వద్ద మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులకు దోహదం చేశారని సీఎం పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం భారత ఆర్థిక, సామాజిక విధానాల్లో ముఖ్యమైన దశగా కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించిన బాధ్యతలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ పరిణామాల్లో కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్