
సంగారెడ్డి, 27 సెప్టెంబర్ (హి.స.)
సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి చిరస్మరణీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
సంగారెడ్డిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆదివారం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం బాపూజీ జీవితాంతం కృషి చేశారని తెలిపారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
బాపూజీ చూపిన ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమానత్వం మార్గాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..