
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆస్తుల పై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా తరలివచ్చి ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
గతంలో ఈడీ సోదాలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు తీవ్రస్థాయిలో నిలదీశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజుతో పాటు పలువురు ముఖ్య బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
గతంలో సోదాలు జరిపిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారని, తక్షణమే తదుపరి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
నిరసనలో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, లోపలికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు