
అమరావతి , 29 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల కోర్టు కేసుల్లో క్లారిటీ వచ్చాకే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని, ఆలస్యమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొద్ది రోజులుగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పునేఠా పేర్కొన్నారు.
ఈ కల్పిత వార్తలతో ఎస్ఈసీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ధ్రువీకరణ లేని సమాచారాన్ని ఎవరూ ఫార్వర్డ్ చేయవద్దని హెచ్చరించారు. కమిషనర్ పేరుతో అసత్యాలను ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్ఈసీ, ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఎలాంటి ప్రకటన ఉన్నా కేవలం అధికారిక ప్రెస్ మీట్లు లేదా అధికారిక ప్రకటనల ద్వారానే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఏదైనా సమాచారం వస్తే అధికారిక వెబ్సైట్లో సరిచోసుకోవాలని కోరింది.
మరోవైపు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వార్డుల పునర్విభజన పనులను మళ్లీ ప్రారంభించింది. అలాగే, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కూడా ఎస్ఈసీ కసరత్తు వేగవంతం చేసింది. సెప్టెంబర్ 23 నాటికి మండల ప్రజా పరిషత్లు, సెప్టెంబర్ 24 నాటికి జిల్లా ప్రజా పరిషత్ల ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్