
హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉదంతంపై తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారనే వాదనకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించింది.
ఈ వివాదానికి బాధ్యులైన సిబ్బందిని గుర్తించి సమగ్ర నివేదికను రూపొందించాలని, ఆ రిపోర్టును అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని కోర్టు సూచించింది. ఒకవేళ పోలీసులు స్పీకర్ ఆదేశాల మేరకే ఆ విధంగా ప్రవర్తించి ఉంటే, వారిపై చర్యలు తీసుకునే అధికారం పూర్తిగా స్పీకర్ పరిధిలోకి వస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్కు ఉన్న అధికారాల ప్రాధాన్యతను కూడా హైకోర్టు ప్రస్తావించింది.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా సవరించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో గేటు వద్ద జరిగిన ఈ ఉద్రిక్తతపై పూర్తి స్థాయి వివరాలను సేకరించాలని ఆదేశించింది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు చేసిన ఆరోపణలు, హైకోర్టు తాజాగా ఇచ్చిన ఈ ఆదేశాలతో రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్