
చాంగ్లాంగ్ జిల్లా, 29 సెప్టెంబర్ (హి.స.)
భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లా పరిధిలో ఉన్న పాన్సౌ పాస్ (Pangsau Pass) ప్రాంతంలో రోజూవారీ విధుల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 21వ అస్సామ్ రైఫిల్స్ బలగాల బృందంపై అనుమానిత ఉగ్రవాదులు అకస్మాత్తుగా ఎదురుదాడికి పాల్పడ్డారు.
ఉదయం వేళలో సరిహద్దు వెంబడి కంచె వేస్తున్న ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ మెరుపు దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్‌ను హవాల్దార్ జాన్ఖోకై కుకి (42) గా గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఇతర భద్రతా సిబ్బంది గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఉగ్రదాడి వెనుక ఎన్‌ఎస్‌సీఎన్-కెవైఏ (NSCN-KYA - Yung Aung faction) మరియు ఉల్ఫా-ఇండిపెండెంట్ (ULFA-I) ఉగ్రవాద సంస్థల హస్తం ఉండొచ్చని భద్రతా బలగాలు మరియు నిఘా వర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం మరియు వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన సరిహద్దు కావడంతో, ఉగ్రవాదులు దాడి అనంతరం మయన్మార్ వైపునకు పారిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే అస్సామ్ రైఫిల్స్ మరియు ఇతర భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం ప్రత్యేక బలగాలతో కూడిన బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. సరిహద్దు వెంబడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా హైఅలర్ట్ ప్రకటించి, నిఘాను మరింత కఠినతరం చేశారు. ఈ ఘటనతో ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi