భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు.. చర్చలు క్లిష్టమైనా అవగాహనకు చేరుకున్నామన్న జైశంకర్
భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
Trade deal


ఢిల్లీ , 29 సెప్టెంబర్ (హి.స.)భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగైన దిశలో తీసుకెళ్లేందుకు అది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఒప్పంద చర్చలు తొలుత ఊహించినంత వేగంగా ముందుకు సాగలేదని, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం, ఉత్పత్తి విధానాలు, చిన్న ఉత్పత్తిదారులు, వ్యవసాయ రంగం వంటి అంశాల కారణంగా చర్చలు మరింత క్లిష్టంగా మారాయని వివరించారు.

భారత్–అమెరికా వాణిజ్య చర్చలు గత కొంతకాలంగా రెండు దేశాల ఆర్థిక, దౌత్య సంబంధాల్లో ప్రధాన అంశంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసినప్పటికీ, అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పులు తదుపరి చర్చలపై ప్రభావం చూపాయి. అమెరికా అదనపు సుంకాల వ్యవస్థ, భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో లభించే పోటీ ప్రయోజనం, వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమల ప్రయోజనాలు వంటి అంశాలు చర్చల్లో కీలకంగా మారాయి.

భారతదేశంలో కోట్లాది మంది చిన్న రైతులు, చిన్న వ్యాపారులు, చిన్న తయారీ యూనిట్లపై ఆధారపడి ఉన్నారని ఆయన వివరించారు. అమెరికాతో పోలిస్తే భారత్లో తలసరి ఆదాయం మాత్రమే కాకుండా ఉత్పత్తి వ్యవస్థ స్వభావం కూడా భిన్నంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు చాలా వరకు ముందుకు సాగాయని, అయితే అమెరికా వైపు మారిన సుంకాల విధానం, కొత్త Section 301 ప్రక్రియ వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమని జైశంకర్ తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. అక్కడ G20 సమావేశంతో పాటు అమెరికా వాణిజ్య ప్రతినిధులతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande