
హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ వైఫల్యాలను, చేతకానితనాన్ని పార్టీ అధినేత కేసీఆర్పై రుద్దడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. గుంటనక్క మైండ్గేమ్లో పడి స్వయంగా పార్టీ అధినేతనే తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పెట్టుకోవద్దని, అన్ని విషయాలను నిర్దిష్టమైన ఆధారాలతో బయటపెడతానని హెచ్చరించారు.
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే విధంగా పార్టీ వైఫల్యాలను కేసీఆర్పై మోపుతూ బీఆర్ఎస్కు గోతులు తవ్వుతున్నారని ధ్వజమెత్తారు. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక అవినీతి వ్యక్తిని విమర్శిస్తే కొన్ని గంటల్లోనే సస్పెండ్ చేశారని, అలాంటిది ఇప్పుడు అదే వ్యక్తితో కలిసి తిరుగుతూ కేసీఆర్ తీరు వల్లే పార్టీ నష్టపోయిందని అనడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని నిలదీశారు. అధినేతను, ఆయన విధానాలను బహిరంగంగా తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఫామ్హౌస్లు, అక్రమ అనుమతులు, ఆంధ్రా స్నేహితులకు ప్రయోజనాలు చేకూర్చడం, క్విడ్ ప్రో కో వ్యవహారాలతో బీఆర్ఎస్ను పాతాళానికి నెట్టింది మీరేనంటూ కేటీఆర్పై కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఒక రైతు ఫోన్లో మాట్లాడుతుంటే అతని భార్యను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, సాయం కోరుతూ వచ్చిన మహిళతోనూ అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గణేశ్ నిమజ్జనోత్సవ సమయాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎంతమందిని బతిమాలుకున్నారో ఆ దేవుడికి, వారి అంతరాత్మకే తెలుసని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి విషనాగుల మాటలు విని మాట్లాడనని, అన్నీ పక్కా ఆధారాలతోనే బయటపెడతానని స్పష్టం చేస్తూ హెచ్చరిక జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్