
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ), కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారుల సేవలను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోనుంది.
ఇందుకోసం ఆర్మీలోని ఇంజినీరింగ్ అధికారుల సహాయాన్ని సర్కార్ కోరింది. దీనిపై స్పందించిన ఆర్మీ ప్రధాన కార్యాలయం.. ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లు రాష్ట్రానికి పంపించింది. డిప్యుటేషన్పై ముగ్గురు అధికారులను తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పర్యవేక్షణకు ఒక ఆర్మీ అధికారి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు ఇద్దరు ఆర్మీ అధికారులను తీసుకోనున్నారు. ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎస్ఎల్బీసీ సాంకేతిక సవాళ్లపై ఆర్మీ చీఫ్తో చర్చించారు. కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ సమావేశం అనంతరం ఆర్మీ హెడ్క్వార్టర్స్ స్పందించి.. ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. మరోవైపు.. 44 కిలో మీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్లో 35 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం మూడు బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ పరీక్షలు నిర్వహించారు. మట్టి, కాంక్రీట్, పునాదుల పరీక్షలు తుది దశకు చేరాయి. భద్రత, నాణ్యత విషయంలో రాజీ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్