వైఎస్ వివేకా హత్య కేసు అసలు లబ్ధిదారుడు జగనే: మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన ఆరోపణలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన మరియు అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డియేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Minister satya prasad


అమరావతి , 29 సెప్టెంబర్ (హి.స.)వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన మరియు అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డియేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈడీ మరియు సీబీఐ దర్యాప్తు వేగవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని, ఈ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ అధినేత ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే దానిని గుండెపోటుగా చిత్రీకరించి, సాక్ష్యాలను మాయం చేసిన చరిత్ర జగన్ది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి, నిందితుడు సునీల్ యాదవ్ వెల్లడించిన నిజాలు, రూ. 40 కోట్ల సుపారీ లావాదేవీలన్నీ తాడేపల్లి నివాసం వైపే స్పష్టంగా వేలెత్తి చూపుతున్నాయి అని అనగాని పేర్కొన్నారు. హత్య కేసు విచారణ అత్యంత కీలకమైన దశకు చేరుకోవడంతోనే డీఎస్సీ వంటి ఇతర అంశాలపై వైసీపీ కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయుడు కాకుమాను రాజశేఖర్ను ధర్నాకు బలవంతంగా పిలిపించి, ఆయన మృతికి పరోక్షంగా కారకులయ్యారని, ఇప్పుడు ఆ దుర్మరణంపై కూడా వైసీపీ శవ రాజకీయం చేస్తోందని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.

తప్పులు చేస్తూ ఎదురుదాడికి దిగడం వైసీపీకి పరిపాటిగా మారిందని, ఆ పార్టీ తన పేరును 'గొడ్డలి డైవర్షన్ పార్టీ'గా మార్చుకుంటే సముచితంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ మీడియా ముందుకు వచ్చి వివేకా హత్య వెనుక ఉన్న అసలు వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నింటినీ తమ ప్రభుత్వం కూలంకషంగా పరిష్కరించి, వారికి భరోసానిస్తుందని హామీనిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande