హల్ద్వానీ శుద్ధీకరణ వివాదంపై దేశవ్యాప్తంగా దళిత-ఆదివాసీ స్వాభిమాన ఉద్యమం నిర్వహించనున్న కాంగ్రెస్: మల్లు రవి
హల్ద్వానీలో జరిగిన శుద్ధీకరణ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా దళిత-ఆదివాసీ స్వాభిమాన అభియాన్ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు
malluravi


కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 29: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ తర్వాత ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన శుద్ధీకరణ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా దళిత-ఆదివాసీ స్వాభిమాన అభియాన్‌ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు.

హిందుస్థాన్ సమాచార్ తో మాట్లాడిన మల్లు రవి, హల్ద్వానీ ఘటనను కేవలం మల్లికార్జున ఖర్గే అవమానంగా కాకుండా యావత్ ఎస్సీ, ఎస్టీ సమాజ గౌరవానికి సంబంధించిన అంశంగా పార్టీ భావిస్తోందని మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 8న దాదాపు 22 మంది ఎంపీలు పార్లమెంట్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో సుమారు మూడున్నర గంటల పాటు ఎంపీలు స్టేషన్‌లోనే నిరసన తెలిపారన్నారు. ఆ తర్వాతే హల్ద్వానీలో ముందే నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలు వెల్లడించారని పేర్కొన్నారు. కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం సరిపోదని, నిందితులపై సమగ్ర దర్యాప్తు జరిగి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 29న నిర్వహించిన దళిత-ఆదివాసీ స్వాభిమాన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రులతో పాటు పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగాల కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నట్లు మల్లు రవి తెలిపారు. ఖర్గేకు సంఘీభావం తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం, హల్ద్వానీ ఘటనపై దర్యాప్తు మరియు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే రీతిలో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఉద్యమం ఏ ఇతర వర్గానికి వ్యతిరేకం కాదని, రాజ్యాంగ బద్ధంగా న్యాయం, సమాన గౌరవం, మన్నన, స్వేచ్ఛ, సమానత్వం కోసం సాగే ఒక ప్రజాస్వామ్య పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షులు, మంత్రుల అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్ వ్యూహం ఖరారవుతుందన్నారు. నవంబర్ చివరి వారంలో తాల్కటోరా స్టేడియంలో భారీ సభ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.

హల్ద్వానీలో జరిగిన శుద్ధీకరణను స్థానిక మతపరమైన ఆచారంగా చెప్పడంపై స్పందిస్తూ... రామ్‌లీలా మైదానాలు అన్ని రాజకీయ పార్టీల సభలకు ఉపయోగిస్తారని, అక్కడ రాజకీయ ప్రసంగాలు కూడా జరుగుతాయని అన్నారు. కేవలం స్థానిక మతపరమైన ఆచారంగా పేర్కొంటూ ఈ ఘటన తీవ్రతను తగ్గించలేమని ఆయన ఆరోపించారు. కాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాత్రం హల్ద్వానీలో చేసిన హోమం ఏ వ్యక్తికి లేదా కులానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్ గురించి మాట్లాడుతూ... దానిని తొలగించాలని, రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని మల్లు రవి తెలిపారు. రాహుల్ గాంధీ కేవలం న్యాయం జరగాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నారన్నారు.

మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, జనగణన మరియు పరిధి నిర్ధారణ (డీలిమిటేషన్) నుంచి వేరు చేసి దీనిని అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్లలో సముచిత వాటా దక్కాలని అభిప్రాయపడ్డారు.

పరిధి నిర్ధారణ (డీలిమిటేషన్) అంశంపై దక్షిణ భారతదేశ రాష్ట్రాల ఆందోళనలను ప్రస్తావిస్తూ... కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను మార్పు చేయడం వల్ల కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల వ్యత్యాసంలో విపరీతమైన మార్పులు ఉండకూడదని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఆర్థిక వనరులు, బడ్జెట్, హక్కుల పంపిణీ ప్రజాస్వామ్య పద్ధతిలో సమానంగా అందాలని కోరారు.

ఒక దేశం-ఒక ఎన్నికలు (వన్ నేషన్-వన్ ఎలక్షన్) ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థలో వేర్వేరు రాష్ట్రాల్లోని భిన్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వాలు వేర్వేరు సమయాల్లో పడిపోవచ్చునని, అలాంటి సందర్భాల్లో ఎన్నికలు కూడా వేర్వేరు సమయాల్లోనే జరగాల్సి వస్తుందన్నారు. ఏ వ్యవస్థ అయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)పై ఆరోపణలు చేస్తూ... పార్లమెంటు సమావేశాల పై ప్రధానమంత్రి లేదా హోంమంత్రిని దీనిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియకు సంబంధించి బయటకు వస్తున్న వార్తలను ఉటంకిస్తూ పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎస్‌ఐఆర్ ద్వారా ప్రతిపక్ష అనుకూల ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని దావా వేశారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఓటర్ల రాజకీయ ప్రాధాన్యతలను గుర్తించి, ప్రతిపక్ష మద్దతుదారుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కుల గణన, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలనే డిమాండ్‌పై మాట్లాడుతూ... కాంగ్రెస్ ఈ అంశంపై రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ శాసనసభలో కుల సర్వేకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తుచేశారు. కుల గణనలో వెనుకబడిన తరగతుల వివిధ వర్గాలు, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఇతర సామాజిక-ఆర్థిక ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande