
హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)
విజయదశమి పర్వదినాన శుభప్రదంగా భావించే పాలపిట్టలను పంజరాల్లో బంధించి, ప్రదర్శనకు ఉంచే అసాధారణ చర్యలపై రాష్ట్ర అటవీ శాఖ తీవ్రంగా స్పందించింది. పండుగ పేరుతో పక్షులను బంధించడం లేదా హింసించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలుంటాయని అటవీ దళాల అధిపతి (హెచ్వోఎఫ్ఎఎఫ్) వినయ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు అరణ్యభవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయం ప్రకారం విజయదశమి రోజు పాలపిట్ట దర్శనం ఎంతో పవిత్రమైనది. అయితే, ఈ ఆచారాన్ని కొందరు వ్యాపార ధోరణితో దుర్వినియోగం చేస్తూ, పక్షులను పట్టుకొచ్చి బోనుల్లో బంధిస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిర్బంధించడం వల్ల పక్షులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై, ఆహారం అందక మృత్యువాత పడుతున్నాయని హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పాలపిట్టలను బంధించడం పూర్తిగా నేరమని, గత ఏడాది కూడా ఇలా అక్రమంగా బక్షించిన 28 పిట్టలను రక్షించి సురక్షితంగా విడిచిపెట్టినట్లు గుర్తుచేశారు.
సహజసిద్ధంగానే దర్శనం చేసుకోవాలి..
పాలపిట్టను దాని సహజ ఆవాసంలో, స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుండగా చూడాలనేదే మన అసలైన సంప్రదాయమని అధికారులు స్పష్టం చేశారు. పంజరంలో ఉంచి ప్రదర్శించడం ఆచార విరుద్ధం. ముఖ్యంగా దసరా ఉత్సవాలు, జాతరలు జరిగే ప్రాంతాలు మరియు ఆలయాల పరిసరాల్లో పక్షులను ప్రదర్శించకుండా కట్టడి చేయాలని దేవాదాయ శాఖకు అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రజలు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్