తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశం
తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు
Lokesh


అమరావతి, 03 సెప్టెంబర్ (హి.స.)

తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. కొత్త పింఛన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త ఫించన్లు ఇవ్వాలని మంత్రి లోకేశ్ అన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ కొత్త ఫించన్లు ఇవ్వాలని మంత్రులకు తెలిపారు.

అలాగే, స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమవ్వాలని.. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. అక్టోబర్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని..ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టు పెండింగ్లో ఉన్నవి కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్నింటిలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. తొలుత పురపాలికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు వాయిదా పడాలన్న గొడ్డలి పార్టీ కుయుక్తులు పని చేయవని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగి రాష్ట్రానికి నష్టం జరగాలనే కుట్రతో గొడ్డలి పార్టీ ఉందని మండిపడ్డారు. అన్ని కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించుకుని అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు.

విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంక్షేమ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని మంత్రి అన్నారు. మాట వినని అధికారుల్ని ఉపేక్షించేది లేదన్నారు. కొందరు అధికారుల పనితీరు శాఖకు, మంత్రికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరు అధికారుల తీరు వల్లే ఇటీవల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పుకొచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని తప్పు పడుతూ కొందరు ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపైనా మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 9న అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించి 3ఏళ్లు అవుతుందని, నాటి దుశ్చర్య నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అందరికీ గుర్తు చేసేలా సెప్టెంబర్ 9న ఓ కార్యక్రమానికి రూపకల్పన చేద్దామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande