
నల్గొండ, 03 సెప్టెంబర్ (హి.స.)
మునుగోడు నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రహదారులను గుర్తించి త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చామని చెప్పారు.
గ్రామాలను మండల కేంద్రాలు, ప్రధాన పట్టణాలతో అనుసంధానించే రహదారులకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారులను నిర్మిస్తామని చెప్పారు. రహదారి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్ణీత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గుడిమల్కాపురం గ్రామం నుంచి సాయిగోనిభాయి వరకు రూ.32.90 కోట్లతో, సర్వేల్ నుంచి నారాయణపురం వరకు రూ.11 కోట్లతో, సర్వేల్ నుంచి పలివెల వరకు రూ.32.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాజగోపాల్రెడ్డి అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు