
నంద్యాల, 03 సెప్టెంబర్ (హి.స.) నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా వద్ద రైతుల ఆవేదన కట్టలు తెంచుకుంది. కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వినూత్న నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసీ కెనాల్ పరిధిలో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మినుము పంటలను సాగు చేశామని రైతులు తెలిపారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఒక్క తడి కూడా అందక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పంటలు ఎండిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని వాపోయారు.
కేసీ కెనాల్ను నమ్ముకుని జీవిస్తున్న నందికొట్కూరు, జూపాడుబంగ్లా, మిడ్తూరు మండలాల రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 875 అడుగులకు పైగా నీరు నిల్వ ఉన్నప్పటికీ కేసీ కెనాల్కు ఒక్క చుక్క నీరు విడుదల చేయకపోవడం దారుణమని రైతులు మండిపడ్డారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా వెంటనే కేసీ కెనాల్కు నీటిని విడుదల చేస్తేనే పంటలు బతుకుతాయని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సమయానికి నీరు అందేదని, ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమను పూర్తిగా విస్మరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV