
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
ఏసీబీ కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు పంపిన రేడియో మెసేజ్ ఆధారంగా డాక్టర్ లక్ష్మీ భాస్కర్ను సెప్టెంబర్ 22న సాయంత్రం 6.30 గంటల నుంచి అరెస్టు చేసి కస్టడీలో ఉంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన కస్టడీ 48 గంటలకు మించడంతో తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1991 ప్రకారం సస్పెన్షన్కు అర్హత ఏర్పడినట్లు నిమ్స్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ మెమో, ఏసీబీ రేడియో మెసేజ్లను పరిశీలించిన అనంతరం డాక్టర్ లక్ష్మీ భాస్కర్ను 2026 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చేలా సస్పెండ్ చేస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సస్పెన్షన్ కాలంలో నిబంధనల ప్రకారం ఆయనకు జీవన భృతి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ సస్పెన్షన్కు సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ, విజిలెన్స్ కమిషన్ తదితర సంబంధిత అధికారులకు నిమ్స్ అధికారులు పంపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు