
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (శంషాబాద్) బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడకు బయలుదేరిన ఓ ప్రయాణికుల విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో, అప్రమత్తమైన పైలట్ దానిని అత్యవసరంగా కిందకు దించారు. ఈ హఠాత్పరిణామంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అధికారుల వివరాల ప్రకారం.. ఫ్లై91 (Fly91) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 45 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది. అయితే విమానం గగనతలానికి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించారు. వారి అనుమతితో విమానాన్ని వెనక్కి మళ్లించి, తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో అటు ప్రయాణికులు, ఇటు విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌లైన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. అనంతరం సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేసి మరమ్మతులు ప్రారంభించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారిని ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi