
గోదావరిఖని, 30 సెప్టెంబర్ (హి.స.)
సింగరేణి సంస్థను అమ్ముకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఈటల ఆరోపించారు. బుధవారం రామగుండం ఎన్టిపిసి లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని, కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. వాతావరణంలో మార్పుల వలన పంటలకు తగినంత నీరందక కరువు పరిస్థితిలో వస్తున్నాయన్నారు. సాగునీటి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా రైతులకు అవసరమైన నీటిని అందించాలని కోరారు. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు, విద్యుత్ అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
తెలంగాణకు ఆర్థికంగా, పారిశ్రామికంగా కీలకమైన సింగరేణి సంస్థ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. సింగరేణిని అమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. సింగరేణి సంస్థ ప్రయోజనాలను, కార్మికుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై కూడా ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు