శిక్షణతోనే సమర్థ పోలీస్ నాయకత్వం: DGP సీవీ ఆనంద్
పోలీస్ అధికారులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, నిబద్ధతతో పాటు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ సూచించారు.
Dgp


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, నిబద్ధతతో పాటు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ సూచించారు. పోలీస్ అధికారుల కెరీర్ విజయవంతం కావడానికి పటిష్టమైన శిక్షణే ప్రధాన పునాది అని డీజీపీ స్పష్టం చేశారు. ఇవాళ ఆర్బోవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ సుమారు గంటన్నరపాటు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ నాయకత్వం, బాధ్యతలు, నైతికత, ప్రజలతో వ్యవహరించే తీరుపై పలు కీలక దిశానిర్దేశం చేశారు.పదవిలో ఉన్నంత మాత్రాన నాయకత్వం రాదని, నాయకుడికి ప్రత్యేకమైన లక్షణాలు అవసరమని డీజీపీ పేర్కొన్నారు. ధైర్యం, స్పష్టమైన దార్శనికత, సమగ్రత, విలువలు-నైతికత, టీమ్ స్పిరిట్, నిష్పక్షపాత వైఖరి, సమర్థ కమ్యూనికేషన్, సాంకేతిక పరిజ్ఞానం, వినయం వంటి లక్షణాలు ముఖ్యమని చెప్పారు. సర్వీసులో నైతిక విలువలపై యువ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని హెచ్చరించారు.కేవలం చట్టాల పరిజ్ఞానం మాత్రమే మంచి పోలీస్ అధికారిగా తీర్చిదిద్దదని, నాయకత్వం, మానవీయ దృక్పథం, దర్యాప్తు నైపుణ్యం, సాంకేతిక అవగాహన, శారీరక దృఢత్వం అవసరమని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande