వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్
ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు
Collector


జోగులాంబ గద్వాల, 30 సెప్టెంబర్ (హి.స.)

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వీక్ లో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు సీనియర్ సిటిజెన్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం గద్వాల ఇండోర్ మైదానంలో నిర్వహించిన యోగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వీక్ లో భాగంగా వివిధ క్రీడా పోటీలు, వైద్య శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు వయోవృద్ధులు ప్రతినిత్యం యోగ, నడక సాధన చేయాలన్నారు. పుస్తకాలు చదవడం, నచ్చిన పాటలు వినడం, ఇతర హాబీలతో జీవిత చరమాంకాన్ని వృద్ధులు సంతోషంగా గడపాలని సూచించారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలోనూ ధ్యాన, యోగ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెల్ ఫోన్స్ చూడడం తగ్గించాలని, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపితే ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande