
నాగర్ కర్నూల్, 30 సెప్టెంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి రీ సర్వే ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు, భూముల హద్దుల నిర్ధారణ, భూ రికార్డుల స్పష్టత తదితర అంశాలపై రైతులతో కలెక్టర్ చర్చించారు. సర్వే ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు తమ భూములకు స్పష్టమైన హద్దులు ఏర్పడటంతో పాటు భవిష్యత్తులో భూ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉందని, భూముల రీ సర్వే ప్రక్రియపై సానుకూలంగా స్పందించారు. ఖానాపూర్ గ్రామ పరిధిలో మొత్తం 2,525 ఎకరాల 15 గుంటల భూములను రీ సర్వే ప్రక్రియలోకి తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. ప్రభుత్వ, అటవీ, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పట్టా భూములను సమగ్రంగా సర్వే చేసి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భూముల హద్దులను గుర్తించి నమోదు చేయడం మ్యాపులను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు