
తిరుపతి, 30 సెప్టెంబర్ (హి.స.)ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్ గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ విశేష సంఖ్యలో భక్తులు, అనుచరులను కలిగిన కల్కి భగవాన్ మృతి వార్త తెలియడంతో ఆధ్యాత్మిక లోకంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.
కల్కి భగవాన్ భౌతికకాయాన్ని తిరుపతి జిల్లా పరిధిలోని బత్తులవల్లంలో గల ప్రసిద్ధ 'ఏకం' (Ekam) ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులు, అనుచరుల చివరి చూపు, దర్శనార్థం పార్థివదేహాన్ని ఆలయంలో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం శనివారం నాడు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలు, సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV