స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
తిరుపతిలో పర్యటనలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పల్లా శ్రీనివాస్


తిరుపతి, 30 సెప్టెంబర్ (హి.స.)తిరుపతిలో పర్యటనలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీలో సీఎం చంద్రబాబు, దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మోదీ సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ నాలుగు రాష్ట్రాల్లో బైక్ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) తిరుపతి అలిపిరి నుంచి సేవా సంకల్ప్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తికావడంతో ఈ యాత్రను చేపట్టారు. 25మంది తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు బైక్ యాత్రలో పాల్గొంటున్నారు. 8రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీవారి ఆశీస్సులను కోరుకుని యాత్ర ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా యాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు.

స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడే అవకాశం ఉందని, అలా పార్టీ మారిన వెంటనే వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు పల్లా శ్రీనివస్.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిని వీడలేదని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, టీడీపీ, జనసేన పేర్లతో విదేశాల్లో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు.గెలుపే ధ్యేయంగా విస్తృత సర్వేల నిర్వహణ, కూటమి నాయకులందరి ఆమోదంతో ముందుకెళ్లే వ్యూహాన్ని రచిస్తున్నామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, గుర్తింపు ఉంటుందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. జగన్ హయాంలో చేసిన అప్పులు, అక్రమాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande