
అనంతపురం, 04 సెప్టెంబర్ (హి.స.) శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఇస్కాన్ మందిరాన్ని విద్యుద్దీపాలంకరణలు, ప్రత్యేక డెకరేషన్లతో ముస్తాబుచేశారు.
గోకులకృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు.
నిన్న గురువారం సాయంత్రం ఇస్కాన్ మందిరం వద్ద బారికేడ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ మందిరాల్లోనూ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించనున్నారు. వేడుకల నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం తమ చిన్నారులకు రాధా, కృష్ణుల వేషాలు వేయించి ముచ్చటపడేందుకు సమాయత్తమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV